మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:మాచర్లలో శనివారం రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ,మాచర్ల కార్యకర్తలు ఎన్నో కష్టాలను భరించారు, ఎన్నో పోరాటాలు చేశారు, గెలుపును సాధించారు.కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగుదేశం జెండా మాచర్లల్లో ఎగిరింది. రౌడీయిజాన్ని తట్టుకుని నిలబడగలిగితే మాచర్ల ఎప్పుడూ టీడీపీదే అని కొనియాడారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునే విషయంలో గతంలో జరిగిన పొరపాట్లకు అస్కారం లేకుండా చూశామని, ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా మాచర్లలో గెలుపొందాలని బ్రహ్మానంద రెడ్డికి టిక్కెట్ ఇచ్చాం అని అన్నారు.
చాలా మంది బ్రహ్మానంద రెడ్డికి అడ్డం పడ్డారు, కానీ ఆయనైతేనే కరెక్ట్ అని టిక్కెట్ ఇచ్చాం, బ్రహ్మానంద రెడ్డి కూడా దాన్ని నిలబెట్టుకున్నారు.
మీకు ఇప్పుడు ఓ పక్క బ్రహ్మానంద రెడ్డి, మరోపక్క లావు కృష్ణదేవరాయలు ఉన్నారు.
ఒకరు ఎమోషనలుగా, దూకుడుగా ఉంటారు. ఇంకొకరు కూల్ గా రాజకీయం చేస్తారు.మాచర్ల లాంటి నియోజకవర్గానికి ఇద్దరూ అవసరమే,మాచర్లలో ఏళ్ల పాటు అరాచకం సాగించింది. అయితే 2024 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో మనుషులు మారారు కానీ, కొందరు రాజకీయనేతలు మారలేదు.
మాచర్లలో హత్యా రాజకీయాలు పోవాలి. హత్యకు ప్రతీకారంగా హత్య చేయడం కాదు, వాళ్లను రాజకీయంగా సమాధి చేయాలి.
భవిష్యత్తులో మాచర్లలో టీడీపీకి ఓటమి అనేదే ఉండదు. పల్నాడులో రక్తం పారడం కాదు, నీళ్లు పారిస్తాం. నీళ్లు తెచ్చి మార్పు చూపిస్తాం అని తెలిపారు.
మాచర్లలో శాశ్వతంగా శాంతిని నెలకొల్పే బాధ్యతను తీసుకుంటామని, రౌడీ రాజకీయాలకు ఇక మాచర్లలో స్థానం లేదు అని, శాంతి భద్రతలకు భంగం కలిగించాలనే విపరీతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులకు ఇక్కడ కాలం చెల్లింది అని అన్నారు.
ప్రజలకు చెడ్డపేరు తెచ్చే పనులు మన పార్టీ కార్యకర్తలు చేయరు, చేయబోరు,ప్రజల్లో టీడీపీ కార్యకర్తలకు మంచి పేరు ఉంది కాబట్టే ఇన్నాళ్లు నిలబడగలిగామని.రాయల సీమలో ఫ్యాక్షన్ ను లేకుండా చేశాం. నీళ్లు ఇచ్చాం. పరిశ్రమలు తెచ్చాం. దీంతో మొన్నటి ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి అద్భుత విజయాన్ని ఇచ్చారు. రాయలసీమలో ఈ సారి గతానికంటే ఎక్కువ సీట్లే వస్తాయి. 15 నెలల్లో ఆ ప్రాంతంలో గ్రాఫ్ మరింత పెరిగింది. పార్టీ మరింత బలపడింది.పల్నాడులో కూడా ఇక అభివృద్ది రాజకీయాలు మాత్రమే ఉండాలి. ఫ్యాక్షన్ ను, రౌడీలను శాశ్వితంగా తరిమేయాలి.మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. జల్ జీవన్ మిషన్, అమృత్ కార్యక్రమాల ద్వారా భాగంగా ఇంటింటికి నీరందించే కార్యక్రమం చేస్తున్నాం.
వరికపూడిశెల ప్రాజెక్టు కలను సాకారం చేసి చూపిస్తాం. పల్నాడులో మిర్చిబోర్డు ఏర్పాటుకు కృషి చేస్తామని, మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయించాం.శాశ్వతంగా అధికారంలోకి ఉండాలంటే, దానికి అనుగుణంగానే పని చేయాలి.
కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచన చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం కార్యకర్తలకు బీమా కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం.
గడచిన ఎన్నికల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, గ్యారెంటీ మాది అంటూ హామీలిచ్చింది కార్యకర్తలే అని తెలిపారు.కార్యకర్తల గౌరవం నిలబెట్టేలా హామీలను అమలు చేస్తున్నామని, చరిత్రలో ఇంతటి సంక్షేమం ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. ఇంత సంక్షేమం అందిస్తూ అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు.ఓట్లేయించే బాధ్యత కార్యకర్తలది,కార్యకర్తలను గుర్తించి పదవులతో గౌరవించే బాధ్యత నాది, గత ప్రభుత్వ పాలనలో మీరు పడిన కష్టాలు, మీరు చేసిన పోరాటాలు, మీ త్యాగాలు నేను ఎప్పటికీ మరిచిపోను.ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తాం. ఈమేరకు ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను అని తెలియజేశారు.
Comment List