గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
సకాలంలో నివేదిక అందచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:గోకవరం మండలంలో పలు గ్రామాల్లో గురువారం కలెక్టర్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం వివరాలు ప్రత్యక్షంగా తెలుసుకుని రైతులతో మాట్లాడారు. “పంట నష్టం గుర్తింపు పనులు వేగవంతంగా , పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. రైతులకు సకాలంలో సహాయం అందించేందుకు నష్ట అంచనా లను అన్ని ప్రభుత్వ శాఖల విభాగాలు సమన్వయంతో పని చేయాలి” అని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు.
గోకవరం ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఏర్పడిన ముంపు పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు. అచ్చాయిపేట కాచ్‌మెంట్ ఏరియాలో ఊర కాలువలు మూసుకుపోవడం వల్ల నీటి నిల్వ సమస్యలు తలెత్తు తున్నట్లు స్థానికులు వివరించగా, కలెక్టర్ వెంటనే డెసిల్టేషన్ పనులు చేపట్టి నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపరచాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అనంతరంతంటికొండ గ్రామంలో కలెక్టర్ నీటమునిగిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. వ్యవసాయ మరియు హార్టికల్చర్ పంటల నష్టం అంచనా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. “ప్రతి ఎకరా స్థాయిలో ఖచ్చితమైన వివరాలు సేకరించి, నష్టం నివేదికను హేతుబద్ధంగా సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపావలసి ఉన్న దృష్ట్యా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియ లో వ్యవహరించాలి” అని కలెక్టర్ సూచించారు.అచ్యుతాపురం గ్రామంలో మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, వర్షాల సమయంలో గ్రామంలో నీరు నిల్వ కాకుండా ఉండేలా సక్రమ డ్రెయినేజ్ వ్యవస్థ కల్పించాలని సూచించారు.అదేవిధంగా రానా వంతెన, టానా సెంటర్ ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. రాజమండ్రి–భద్రాచలం ప్రధాన రహదారి గోకవరం మీదుగా వెళ్లడం దృష్ట్యా, వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, సంబంధిత శాఖాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.ఈ పర్యటనలో ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్, డ్వామా పిడి ఏం.నాగ మహేశ్వర రావు, తహసీల్దార్ పి. రామకృష్ణ, ఎంసీపీడీ గోవింద్, మండల వ్యవసాయ అధికారి రాజేశ్వరి, ఇరిగేషన్ , ఇతర శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు శిరీష, రమకుమారి తదితరులు పాల్గొన్నారు...



Comment List