మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు

 

Ad
ఉద్యమంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ఏపీ

2026 జూన్ కు ప్లాస్టిక్ రహితంగా రాష్ట్రం

చెత్తనే కాదు..చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తాం

కూటమి వచ్చేవరకూ పల్నాడులో ప్రజాస్వామ్యం లేదు

రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోం

వరికపూడిశెల పూర్తి చేసి పల్నాడు పల్లెలకు తాగు, సాగు నీరిస్తాం

కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది
 
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 20:రాష్ట్రం నుంచి ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు కాలుష్య రహితంగా మార్చేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ ఉద్యమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ద్వారా 2026 జూన్ నాటికి రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని ఆయన వెల్లడించారు. శనివారం పల్నాడు జిల్లా మాచర్లలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మాచర్లలో స్థానిక చెరువు వద్ద పేరుకుపోయిన చెత్త తొలగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చెరువు గట్టు, పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా ఉన్న చెత్తను, గట్టు వద్ద పేరుకుపోయిన వ్యర్ధాలను మున్సిపల్ కార్మికులతో కలిసి సీఎం తొలగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సీఎం సందర్శించారు. సఫాయి కార్మికులు, వైద్య సిబ్బందితో ముఖ్యమంత్రి సంభాషించారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు రూ.52 కోట్ల విలువైన చెక్కును అందించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.  

*కూటమి వచ్చాకే మాచర్లకు స్వాతంత్ర్యం*

రాజకీయ ముసుగులో రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు అధికారం ఇచ్చింది మంచి పాలన అందించడానికే కానీ ప్రజలపై దాడులు చేయడానికి కాదని అన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణగా నిలవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. చెత్తనే కాదు ..చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనిపై సీఎం మాట్లాడుతూ "
మాచర్ల ప్రజల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నాను. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలాంటి వారే గత ప్రభుత్వంలో మాచర్లకు రాలేక పోయామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్ధం అవుతోంది.  రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు మాచర్లలో రౌడీలు, ముఠా నేతలు స్థానిక ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు. ఎన్నో ఏళ్లుగా మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికలు లేవు. గత ప్రభుత్వంలో నేను మాచర్ల రాకుండా నా ఇంటికి తాళ్లు కట్టారు. ఆ తాళ్లతో వాళ్లు ఉరితాళ్లు వేసుకున్నారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలపై దాడి చేశారు. సీమలో ముఠా రాజకీయాలు లేకుండా చేశాను. పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడాలి ..విద్రోహ శక్తులుగా మారకూడదు". అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. 

*చెత్తనే కాదు...చెత్త రాజకీయాలనూ క్లీన్ చేస్తా*

"స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కోసం పల్నాడుకు వచ్చాను. స్ఛచ్చాంధ్ర అంటే చెత్తను తొలగించి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా చేయడం. గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి పోయింది. చెత్తపైనా పన్ను వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్నుతో పాటు వారు వదిలివెళ్లిన చెత్తనూ తొలగించాం. రోడ్లపై చెత్తతో పాటు చెత్త రాజకీయాలను క్లీన్ చేస్తాం. ప్రజాగ్రహం ఎలా ఉంటుందో ఎన్నికల్లో చూశాం. 33 వేలకు పైగా మెజారిటీతో మాచర్ల చరిత్రలో లేని విధంగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ప్రజలు గెలిపించారు. మాచర్ల పేరు వినగానే నాకు తోట చంద్రయ్య, జాలయ్య, నంబూరి శేషగిరిరావు లాంటి ప్రజాస్వామ్య వీరులు గుర్తొస్తారు. కత్తి మెడపై పెట్టినా కూడా జై చంద్రబాబు అంటూ చంద్రయ్య ప్రాణాలు వదిలాడు. జాలయ్యను అతి కిరాతంగా హతమార్చారు. ప్రజాస్వామ్యం కోసం నంబూరి శేషగిరిరావు పోరాడారు. వారందరికీ నిండు మనసుతో నివాళులు అర్పిస్తున్నాను". అని సీఎం చంద్రబాబు అన్నారు.  

*వరికపుడిశెలను పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది*

పల్నాడు జీవనాడి, 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 1 లక్ష మందికి తాగునీరు అందించే వరికపుడిశెలను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.  సీఎం మాట్లాడుతూ "ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే వాటిని పూర్తి చేసే అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. వరికపుడిశెల మొదటి దశలో 1.54 టీఎంసీలు, రెండో దశలో 6.32 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు. పోలవరం పనులు నేను 74 శాతం పూర్తిచేస్తే గత ఐదేళ్లలో ఒక వ్యక్తి వచ్చి దానిని ధ్వంసం చేశాడు. ప్రజా వేదికతో కూల్చివేత మొదలు పెట్టి పోలవరం డయా ఫ్రాంవాల్ కొట్టుకు పోయేలా చేశారు. మేం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికే పోలవరం పూర్తి అయ్యేది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పనులు వేగవవంతం అయ్యాయి.  2027 నాటికి పోలవరం పూర్తిచేస్తాం.  రాష్ట్రంలోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీకాకుళంలో ఉన్న వంశధారను, గోదావరి, కృష్ణా, రాయలసీమలో పెన్నా నదిని అనుసంధానిస్తాం. ఇప్పటికే గోదావరి కృష్ణా నదిని అనుసంధానించాం. త్వరలోనే గోదావరి వంశధారను అనుసంధానం చేసి  పెన్నాను కూడా కలుపుతాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటాను." అని సీఎం అన్నారు. 

*ప్రభుత్వం తరపున కారంపూడి పలనాటి వీరారాధన ఉత్సవాలు*

మాచర్లను మోడల్ మున్సిపాలిటీగా తయారుచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లను అదనంగా మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా తలసరి ఆదాయంలో తక్కువగా ఉందని అన్నారు. జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి నీరు అందిస్తామని అన్నారు. కారంపొడి పలనాటి వీరారాధన ఉత్సవాలను ప్రభుత్వం తరపున నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే మిర్చి రైతుల విజ్ఞప్తి మేరకు మిర్చి బోర్డు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. 

*స్వచ్చాంధ్ర- పచ్చదనం పెంపులో అంతా భాగస్వాములు కావాలి*

స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ ఫ్రీ నినాదాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నామని  అన్నారు. మున్సిపల్ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పరిశుభ్రమైన నగరాలు, గ్రామీణ ప్రాంతాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 2 కంటే ముందుగానే గత పాలకులు వదిలేసి వెళ్లిన 85 లక్షల టన్నుల చెత్తను 100 శాతం క్లియర్ చేశాం. ఈ లక్ష్య సాధనలో సమర్థవంతంగా పనిచేసిన శానిటేషన్ కార్మికులకు, మునిసిపల్ శాఖ ఉద్యోగులు, అధికారులు, ఆ శాఖ మంత్రి నారాయణకు అభినందనలు. సర్క్యులర్ ఎకానమీలో భాగంగా చెత్త నుంచి సంపద సృష్టిస్తూనే.. ప్రజలు ఇచ్చే చెత్తకు నిత్యావసరాలు ఇస్తూ డబ్బులు ఆదా చేస్తున్నాం. చెత్త నుంచి కరెంటు, కాంపోస్టు తయారు చేస్తున్నాం. కొంత చెత్తను రీ సైక్లింగ్ కు పంపిస్తున్నాం. అలాగే డోర్ టు డోర్ కలెక్షన్ కోసం ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడుతున్నాం. ఇప్పటికే విశాఖ, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. త్వరలో రాజమండ్రి, నెల్లూరు, కడప, కర్నూలులో కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలి. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవా ప్రచారం నిర్వహిస్తున్నాం. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం కోసం సఫై మిత్ర సురక్షిత శిబిరాలు, అలాగే సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. పట్టణ పారిశుధ్య కార్మికులకు బీమా పథకాన్ని ప్రారంభించాం. 16 విభాగాల్లో 52 రాష్ట్ర స్థాయి, 1,421 జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. అక్టోబర్ 2న సఫాయి మిత్రలు, శానిటేషన్ వర్కర్లు, అగ్రస్థానంలో నిలిచిన మున్సిపాలిటీలు  స్వచ్ఛ వాలంటీర్లను జిల్లాల కలెక్టర్లు సత్కరించాలి. పచ్చదనం పెంపులో ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలి. అని ముఖ్యమంత్రి పేర్కోన్నారు. 

*పేదలకు లబ్ది కలిగేలా నిర్ణయాలు*

సూపర్ సిక్స్ పథకాలను ప్రజలు సూపర్ హిట్ చేశారని సీఎం అన్నారు. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్లు తల్లుల ఖాతాలో వేశామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. దీపం పథకం ద్వారా మహిళలకు ఏడాదికి 3 సిలెండర్లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందిస్తున్నామని తొలివిడతగా రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున రూ.3173 కోట్లు జమ చేశామన్నారు. అత్యంత పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఏడాదిన్నరలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని..9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం పీ4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. దసరా కానుకగా ఆటో డ్రైవర్లకు రూ.15 వేలు అందించబోతున్నామని తెలిపారు. ప్రజలందరికీ లబ్ది కలిగించేలా జీఎస్టీ సంస్కరణలు వచ్చాయని సీఎం అన్నారు. 99  రకాల వస్తువులు 5 శాతం స్లాబ్ లోకి వచ్చాయని తద్వారా ధరలు తగ్గుతాయని ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాల ధరలు దిగివస్తాయని వెల్లడించారు. అనంతరం పీ 4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.

Tags:
Views: 43

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం