స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు -ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం
స్మార్ట్ ఇరిగేషన్‌తో సుస్థిర వ్యవసాయం దిశగా ఆంధ్రప్రదేశ్ = ఆటోమేషన్ మైక్రో ఇరిగేషన్‌తో దిగుబడులు పెంపే లక్ష్యం
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఐ న్ బి టైమ్స్ అమరావతి, జనవరి 6: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం విజయవాడలోని గవర్నర్ పేట నందు గల సమగ్ర జలవనరుల నిర్వహణ & రైతు శిక్షణ కేంద్రంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సూక్ష్మ సాగునీటిలో ఆటోమేషన్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నీటి వనరుల తగ్గుదల, వాతావరణ మార్పులు, సాగు వ్యయాల పెరుగుదల వంటి సవాళ్ల మధ్య రైతును కాపాడాలంటే వ్యవసాయాన్ని స్మార్ట్ వ్యవసాయంగా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశానికి మార్గదర్శకమైన మైక్రో ఇరిగేషన్‌ను మరింత బలోపేతం చేస్తూ, “పర్ డ్రాప్ మోర్ క్రాప్” నుంచి “పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్” దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇకపై నీరు, ఎరువుల వినియోగం ఊహలపై కాకుండా సెన్సర్లు, డేటా, ఆటోమేషన్ ఆధారంగా జరగడంతో 20–30 శాతం నీటి ఆదా, కార్మిక వ్యయాల తగ్గింపు, దిగుబడి,నాణ్యత పెరుగుదల సాధ్యమవుతాయని చెప్పారు. ఉద్యాన, తోట, షేడ్ నెట్, గ్రీన్ హౌస్ మరియు అధిక విలువైన పంటలకు ఈ పథకం అత్యంత ఉపయోగకరమని వివరించారు. PMKSY కింద హెక్టారుకు ₹40,000 వరకు మద్దతుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతోందని తెలిపారు. చిన్న, సన్నకారు మరియు SC/ST రైతులకు 55%, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తూ, ఇప్పటికే ఉన్న డ్రిప్‌లలోనూ ఆటోమేషన్ అమర్చుకునే వీలుందని చెప్పారు. ఎంపానెల్ చేసిన కంపెనీల ద్వారానే పారదర్శక అమలు, స్థిర ధరలు, అధికారి తనిఖీ అనంతరమే చెల్లింపులు, ప్రతి భాగంపై “APMIP” ముద్ర తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు. వారంటీ, సర్వీస్ సపోర్ట్, త్వరితగతిన ఫిర్యాదు పరిష్కారం కల్పిస్తూ రైతును ఎప్పుడూ భరోసాగా నిలబెడతామని స్పష్టం చేశారు. నీటి, విద్యుత్, ఎరువుల ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగి, రైతు ఆదాయం స్థిరపడేలా ఆటోమేషన్ ఆధారిత మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ సంస్కరణగా నిలుస్తుంది. స్మార్ట్ వ్యవసాయంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి ఆదర్శంగా నిలబెడదామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ కె.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు



Comment List