టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు
ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు, జూలై 15 :

* అక్రమ రవాణాకు అనువుగా రీఫర్లు, పలకలు గా మార్చివేత
* నెల్లూరు జిల్లా చేజర్ల వద్ద ఘటన
* కారు, మోటారు సైకిల్ స్వాధీనం
*నలుగురు స్మగ్లర్లు అరెస్టు
నెల్లూరు జిల్లా చేజర్ల అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా కు అనుకూలంగా రీఫర్లు, పలకలు గా మార్చిన ఎర్రచందనం, ఇంకా దూలాలు, దుంగలు కలిపి 192 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన కారు, మోటారు సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఏల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్, స్థానిక ఎఫ్ బీఓ ఐ జనార్దన్ తో కలసి సోమవారం నుంచి నెల్లూరు జిల్లా చేజర్ల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున వీరు కలువాయి ఫారెస్ట్ బీటు పరిధి చేరుకోగా, అక్కడ ఒక కారు, ఒక మోటారు సైకిల్ తో కొంతమంది గుమికూడి కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టే లోపు పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకున్నారు వీరిలో ఇద్దరిని తమిళనాడు వాసులుగాను మరో ఇద్దరిని నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు. కారులో లోడ్ చేసిన ఎర్రచందనం తో పాటు సమీపంలో దాచి ఉంచిన వాటితో సహా 192 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 50 లక్షలు గా అంచనా చేశారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా డీఎస్పీలు శ్రీనివాస రెడ్డి, షరీఫ్ లు విచారించారు. ఎస్ ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Comment List