వినాయక ఉత్సవ కమిటీలు నియమ, నిబంధనలు పాటించాలి.. అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) చెంచురెడ్డి..
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 27:వినాయక ఉత్సవ కమిటీలు నియమ, నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను ప్రమాద రహితంగా జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ (ఏ ఆర్) చెంచురెడ్డి అన్నారు. వినాయక చవితి సందర్భంగా బుధవారం నాడు ఆయన గోకవరం మండలంలోని వినాయక ఉత్సవ మండపాలను పరిశీలించి, ఉత్సవ కమిటీలకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం సూచించినటువంటి నిబంధనలను పాటిస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలుగుకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాలను జరిపించుకోవాలన్నారు. చుట్టు ప్రక్కల వారికి ఇబ్బందులు కలిగించే డీజే సౌండ్స్ ఉపయోగించకూడదని తెలిపారు. పర్యావరణ హితమైనటువంటి విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలన్నారు. ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహబంధాలు కలిగి ఉండి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని ఉత్సవ కమిటీలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించినచో ఆ కమిటీలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ ఎస్ పి (ఏఆర్) చెంచురెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్, కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్య కిషోర్, గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comment List